తీరప్రాంతంపై ఓ కన్నేయండి


లాక్‌డౌన్‌ కారణంగా ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల్లో చిక్కుకుపోయినవారు సముద్ర మార్గంలోనూ వచ్చే అవకాశం ఉన్నందున తీర ప్రాంతాలపై ఓ కన్నేసి ఉంచాలని ఎస్పీ అట్టాడ బాబూజీ రాంబిల్లి ఎస్సై వి.అరుణ్‌కిరణ్‌ను ఆదేశించారు. రాంబిల్లి ప్రధాన కూడలిలో లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరును ఎస్పీ సోమవారం పరిశీలించారు. మండలంలో తీరగ్రామాల గురించి అడిగి తెలుసుకున్న ఆయన వేరే ప్రాంతాల నుంచి బోట్లు, తెప్పలపై వచ్చే అవకాశాల గురించి చర్చించారు. తీరం గుండా ఎవరూ వచ్చే అవకాశం లేదని ఎస్సై అరుణ్‌కిరణ్‌ ఎస్పీకి వివరించారు. అలా వచ్చేవారిని మత్స్యకారులు తీరానికి రానివ్వరని చెప్పారు. అనంతరం రాంబిల్లి శివారు వాడపాలెం తీరాన్ని ఎస్పీ సందర్శించి మత్స్యకారులతో మాట్లాడారు. *లాక్‌డౌన్‌ మరింత కఠినంగా అమలు చేయాలని ఎస్పీ అట్టాడ బాబూజీ పోలీసులను ఆదేశించారు. సోమవారం అచ్యుతాపురంలో స్థానిక ఎస్సై జి.లక్ష్మణరావుకు దీనిపై ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్‌ అనుమతి లేకుండా పరిశ్రమలను తెరిచినా, పాస్‌ లేకుండా కార్మికులు తిరిగినా కేసులు నమోదు చేయాలని సూచించారు. అవసరం లేకుండా ఎవరైనా ఇంటి నుంచి నడిచి వచ్చినా విచారించి కేసులు పెట్టాలని ఆదేశించారు. అత్యవసర దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించే విధంగా చూడాలన్నారు. ఇందులో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు లేవని స్పష్టం చేశారు. మునగపాక రిక్షాస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును ఎస్పీ పరిశీలించారు. పోలీస్‌ సిబ్బందితో మాట్లాడారు. మునగపాక మండలంలో లాక్‌డౌన్‌ అమలు తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ఎస్పీ పేర్కొన్నారు. జాతీయ రహదారిపై పాయకరావుపేట వై కూడలి వద్ద, నక్కపల్లి మండలం కాగిత టోల్‌గేట్‌ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలను పూర్తిగా తనిఖీ చేయాలన్నారు. సీఐ ఎస్‌.విజయ్‌కుమార్‌, ఎస్సై రామకృష్ణతో మాట్లాడారు.